Sunday, August 2, 2015

పుణ్యాన్ని ప్రసాదించే ‘గంగ’

పవిత్రమైన గంగానది స్పర్శతో ఎన్నో జీవితాలు పునీతమయ్యాయి. చీకటి అనే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానకాంతులు వెల్లివిరిశాయి. అందుకే ఆ పుణ్యనది జ్ఞానగంగ!
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
ఎక్కడ, ఏ నీళ్ళలో స్నానం చేస్తున్నప్పటికీ పై శ్లోకంలో పేర్కొన్న ఏడు నదులను స్మరించుకోవాలని పెద్దలవాక్కు. ఆ నదుల వరుసలో ప్రథమ తాంబూలం గంగానదికే. గంగ పేరును తలచుకుంటేనే ప్రతి ఒక్క భారతీయుని హృదయం భక్తితో పులకిస్తుంది. పశుపక్ష్యాదులకు, వృక్ష, మానవజాతికి ప్రాణాధారమైన నీటికే ‘గంగ’ పర్యాయపదమైనదంటే, ఆ తల్లి మన జీవనంలో ఎలా మమేకమైపోయిందో ఊహించుకోవచ్చు. అలా ఈ నేల మీద ప్రతి పుణ్యనది గంగా ప్రతి రూపమే, దివి నుంచి భువికి దిగివచ్చిన పావనగంగ పుట్టుక వెనుక ఒక రహస్యమైన కథ ఉంది.
భగీరథ ప్రయత్నం
మనలో ఎవరైనా అత్యంతకష్టమైన పనిని చేయ సంకల్పించినపుడు భగీరథప్రయత్నం అని అంటుంటాం. గంగమ్మతల్లి ఈ భూమికి రావడానికి వెనుక గల అసలు కారణం కూడ భగీరథ ప్రయత్నమే. భూలోకంలో సగరుడు పరిపాలిస్తున్న సమయం. అతనికి కేశిని, సుమతి అనే ఇద్దరు భార్యలు, కేశినివల్ల అసమంజసుడు అనే కొడుకు, సుమతి వల్ల అరవైవేలమంది పుత్రులు కలిగారు. అసమంజసుడు పేరుకు తగ్గట్టుగా క్రూరునిగా దుష్టకృత్యాలను చేస్తుండేవాడు. చిన్న పిల్లల్ని నదిలోకి విసిరేసి పైశాచిక ఆనందాన్ని పొండుతుండేవాడు. ప్రజలతడిని అసహ్యించుకుని సగరునికి మొరపెట్టుకోగా, అతడు కొడుకును రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అనంతరం సగరుడు ఏడు ఆశ్వమేథ యాగాలను తలపెట్టి, అశ్వాన్ని విడిచి, దానివెంట అరవైవేలమంది కొడుకులను పంపాడు. గుర్రం దేశమంతా తిరిగి చివరకు సముద్రంలో ప్రవేశించింది. అప్పడు ఆ గుర్రాన్ని చూసిన ఇంద్రుడు, వాయువును పిలిచి విషయాన్ని చెప్పగా, వాయువు ఆ గుర్రాన్ని బంధించి తీసుకెళ్ళి రాసాతలంలోని కపిలముని ఆశ్రమంలో కట్టేశాడు. సగరపుత్రులకు ఆ తర్వాత గుర్రం కనిపించకపోవడంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పారు. అశ్వమే లేనప్పుడు ఇక అశ్వమేథ యాగానికి అర్థమేముంది? అని సగరుడు కుమిలిపోతాడు. గుర్రంతో తిరిగి వస్తే తప్ప, మరలా రాజ్యప్రవేశం లేదని కొడుకులను ఆజ్ఞాపించాడు సగర చక్రవర్తి. తండ్రిమాటకు ఎదురు చెప్పలేకపోయిన సగర పుత్రులు సముద్రంలోకి వెళ్ళి రసాతలానికి చేరుకొని అక్కడ కపిలమహర్షి ఆశ్రమంలో కట్టివున్నా అశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గురాన్ని దొంగిలించాడని భావించిన సగరపుత్రులు, కపిలుని దూషిస్తూ అనుచింతంగా ప్రవర్తించగా, ముని కోపంతో కనులు తెరవగా, ఆ జ్వాలల్లో భస్మమైపోయారు.
ఈలోపు అసమంజసుని అంశుమంతుడు అనే కుమారుడు కలుగగా, సగరుడు అతడికే రాజ్యాన్ని అప్పగించాడు. అతడు పినతండ్రుల జాడ కోసం ప్రయత్నిస్తాడు. అలా రసాతలానికి చేరుకున్న అతనికి పినతండ్రుల బూడిదకుప్పలుగా కనబడతారు. గరుత్మంతుని ద్వారా తన పినతండ్రులకు ఉత్తమగతులు కలగాలంటే గంగలోపునీతం చేయడం తప్ప మరోమార్గం లేదని తెలుస్తుంది. ఆ ప్రయత్నంలో కొన్ని తరాలు గడచినా తర్వాత భగీరథుని ప్రయత్నం ప్రారంభమవుతుంది. భగీరథుడు తన పూర్వీకులు కపిలుని ఆగ్రహానికి గురై భస్మమైన సంగతిని తెలుసుకుని, వారికి సద్గతులు కలగాలంటే, ఆ భస్మరాశులపై గంగను ప్రవహింపజేస్తే ఫలితముంటుందని తెలుసుకుంటాడు. గంగను తలచుకుని తప్పస్సు చేసిన భగీరథుడు, ఆమెను ఒప్పిస్తాడు. అయితే తానూ కిందికి ప్రవహిస్తున్నపుడు, తనను భరించగల శక్తి శివునికే ఉంది. కాబట్టి ఆయన భారిస్తానంటే, తను భూమిపైకి రావడానికి సమ్మతమేనని గంగ చెబుతుంది. భగీరథుడు తీవ్రమైన తప్పస్సుతో శివునికూడ ఒప్పిస్తాడు. ఆవిధంగా గంగమ్మ తల్లి భూమిపై వచ్చిందని పురాణ కథనం.
అయితే భూమిపైకి దిగిన గంగ జహ్నుముని ఆశ్రమం లోకి వెళ్లగా కోపగించుకున్న జహ్నుముని గంగను నోటపడతాడు. అప్పుడు భగీరథుడు ఆ మునిని ప్రార్థించగా, కరుణించి తన చెవుల నుండి విడిచి పెడతాడు. అలా భగీరథుని ప్రయత్నం వలన భూమికి వచ్చిన గంగ భాగీరథి అని పిలువబడి, అనంతరం జహ్నుముని వలన జాహ్నవి అయింది. చివరకు నగరపుత్రుల భస్మం మీదుగా గంగ ప్రవహించగా, వారికి ఉత్తమగతులు లభించాయి. అలా భగీరథప్రయత్నం ఫలించింది.
ఇలా గంగ గురించి అనేక పురాణాలలో వివిధ కథలను చూడగలం. ఒక కథ ప్రకారం, ఒకసారి నారదుడు భూలోకానికి రాగా, హిమాలయ ప్రాంతాలకు చేరుకునేసరికి సాయంతమయింది. అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోతుండగా, అప్పుడే అతనికి వీనుల విందోనరిస్తూ చక్కని సంగీతధ్వనులు వినిపించసాగాయి. ఆ ప్రకృతిమాట అందించిన పారవశ్యంలో మునిగిపోయి ముందుకు కదిలిన నారదుడు బండరాళ్ళపై పాకుకుంటూ వెళ్తున్న బృందాన్ని చూశాడు. చూపులకు ఎంతో అందంగా కనిపించినప్పటికీ, ఏదో ఒక అవయవ లోపంతో ఉండటం కనిపించింది. నారదుడు విషయమేమిటని అడగ్గా, తాము గంధర్వులమనీ, తాము సంగీతంలోని రాగాలమనీ, ఏ గాయకుడైనా పాడుతున్నప్పుడు, వారి గొంతులో అపశ్రుతులు దొర్లినా, గాత్రంలో గర్వం, అహంకారం పొడసూపినా, రాగలక్షణాలను పట్టించుకోపోయినా తమకు దెబ్బలు తగులుతుంటాయని చెప్పారు. అందుకేమైనా తరుణోపాయం లేదా? అని నారదుడు అడగ్గా, శివుడు గానం చేస్తే, తమకు ఈ దురవస్థ తప్పుతుందని చెప్పారు. వారి మాటలను విన్న నారదుడు, కైలాసానికి వెళ్ళి శివుని పాడాల్సిందిగా అభ్యర్థించాడు.
నారదుని అభ్యర్థనను విన్న శివుడు, పాడేందుకు తన కెలాంటి అభ్యంతరాలు లేవనీ, అయితే, తను పాడుతున్నప్పుడు విని ఆనందించగలిగే శ్రోతలు కావాలని షరతు పెట్టాడు. శ్రోతలుగా బ్రహ్మ, విష్ణువులను ఆహ్వానించిన నారదుడు, అంగవైకల్యం గల గంధర్వులను అక్కడకు రప్పించాడు. శివుని గానంతో విశ్వమంతా మునకలేసింది. క్షణంలో గంధర్వుల అంగవైకల్యం మాయమైంది. అంతటితో కథ ఆగితే విశేషం ఏముంది. శివుని పాటలో మునిగి మైమరచిపోయిన విష్ణువు దేహం కరిగిపోయి నీరై ప్రవహించడం మొదలైయింది. ఈ సంగతిని గమనించిన బ్రహ్మ, ఆ నీటిని తన కమండలంలోకి తీసుకున్నాడు. కొన్ని యుగాలపాటు ఆ నీరు కమండలంలోనే ఉండిపోయింది.
దివినుంచి భువికిదిగిన గంగ శివుని జటలపై ముందుగా కాలిడి, అనంతరం ఈ భూమిపై అడుగుడిన విషయం మనకు తెలిసిందే. అయితే, అదే గంగను శివుడు తన జటలో బంధించిన ఉందంతం ఒకటి ఉంది.
పూర్వం కాలంలో ఒకసారి భూమిపై భయంకర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా నీతి చుక్క లేక భూమి బీటలు వారింది. ఆ స్థితిని చూసిన మునీశ్వరులంతా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో, “స్వామీ! నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడానికి, స్నాన, పానాలకు మాకు నీరే లేదు. మమ్ములను అనుగ్రహించి నీతి ఎద్దడిని తొలగించు స్వామీ!” అని వేడుకున్నారు. వారి ప్రార్థనలను ఆలకించిన చతుర్ముఖుడు తన కమండలంలోని ఒక బిందువును వదిలాడు.
ఆ చిన్న నీతి బిందువే మహా ప్రవాహమై రంగత్తుంగ తరంగాలతో ఉవ్వెత్తున లేచి గలగలా ధ్వనులతో ప్రవహిస్తూ తుదకు ఈ భూమండలాన్నంత ఆక్రమించేట్లుగా విజృంభించింది. జరుగబోయే ఉపద్రవాన్ని గమనించిన శంకరుడు సకల లోకవాసులను కాపాడేందుకు ఆ జలాన్ని తన జటాజూటంలో బంధించి ఒక బిందువును మాత్రం ప్రజోపయోగాని కోసం మానస సరోవరంలో వదిలాడని కథనం.

No comments:

Post a Comment